
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిర్ణయంపై వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు మించిన కొన్ని వ్యాపార సంబంధిత యూపీఐ (P2M) లావాదేవీలపై 0.4 శాతం MDR విధించనున్నట్లు కేంద్రం నిర్ణయించింది.
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఘాజియాబాద్‌లో కొంతమంది వ్యాపారులు అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు మించిన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను స్వీకరించబోమని ప్రకటించారు. ఈ మేరకు తమ దుకాణాల ముందు నోటీసులు ఏర్పాటు చేశారు. రూ.2 వేలకు పైబడిన కొనుగోళ్లకు వినియోగదారులు నగదు తీసుకురావాలని సూచించారు. దీంతో ఈ నోటీసుల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కొత్త నిబంధనల ప్రకారం, రూ.2 వేలకు మించిన కొన్ని P2M యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDRను వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులపై నేరుగా ఈ ఛార్జీ విధించరు. అయితే ఈ అదనపు భారాన్ని వ్యాపారులు భరించలేకపోతే దాని ప్రభావం చివరికి వినియోగదారులపై పడే అవకాశం ఉందని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం P2M యూపీఐ లావాదేవీల్లో ఎక్కువ శాతం చిన్న మొత్తాలవే. ఆగస్టులో 86 శాతం లావాదేవీలు రూ.500లోపు ఉండగా మరో 10 శాతం లావాదేవీలు రూ.501 నుంచి రూ.2,000 మధ్య నమోదయ్యాయి.
కేంద్రం వివరాల ప్రకారం, రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు 0.4 శాతం MDR వర్తించినా గరిష్ఠంగా రూ.300కే పరిమితం అవుతుంది. అందువల్ల ఈ నిర్ణయంపై వ్యాపారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, వ్యక్తుల మధ్య జరిగే సాధారణ UPI చెల్లింపులు (P2P) కొత్త MDR నిబంధనల పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది.
