
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు చెందిన డిజిటల్ చెల్లింపు సేవ ‘యాపిల్ పే’ త్వరలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా వచ్చే నెలలో ఈ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తొలిదశలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు యాపిల్ పే సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌లతోనూ యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యాపిల్ పే సేవలను సంస్థ తొలిసారిగా 2014 అక్టోబర్‌లో అమెరికాలో ప్రారంభించింది.
ప్రస్తుతం ఇది 89 మార్కెట్లకు విస్తరించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టనుంది. ఐఫోన్, యాపిల్ వాచ్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ వంటి యాపిల్ పరికరాలకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను అనుసంధానించుకుని యాపిల్ పే ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.
కార్డు వివరాలను పరికరంలో టోకనైజ్ చేసి భద్రపరచడం ద్వారా ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా పేమెంట్ యాప్‌ను తెరవాల్సిన అవసరం లేకుండానే ట్యాప్-అండ్-పే విధానంలో చెల్లింపులు పూర్తి చేయొచ్చు.
