
ప్రభుత్వ ఉద్యోగం కేవలం ఉపాధి కాదని ప్రజల పట్ల బాధ్యతతో కూడిన సేవ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన విధి అని పేర్కొన్నారు. 20వ ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా దేశవ్యాప్తంగా 51,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా నియామకాలతో రోజ్‌గార్ మేళాల ద్వారా ఇప్పటివరకు అందించిన మొత్తం నియామకాలు 12 లక్షలు దాటాయని వెల్లడించారు. శనివారం చెన్నైలో నిర్వహించిన 20వ రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ 120 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గొప్ప విజయమే అయినప్పటికీ అదే సమయంలో అది ప్రజాసేవలో కొత్త బాధ్యతలకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ఉద్యోగులు ఏ శాఖలో పనిచేసినా ప్రజలకు భారత ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.
2047లో భారత్ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి నేటి యువ ఉద్యోగులు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతాయుతమైన అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణం కేవలం నినాదాలతో సాధ్యం కాదని ప్రతి ఫైల్ పరిష్కారం ప్రతి నిర్ణయం ప్రతి పౌరుడికి అందించే సేవలో దాని సాకారం కనిపించాలని కేంద్ర మంత్రి అన్నారు.
