
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలనే బాధ్యులుగా చూపడం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉద్గారాలకు ప్రధాన కారణమవుతున్న దేశాలను వదిలి ప్రతిసారీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం తగదని పేర్కొన్నారు.
‘పర్యావరణ భవిష్యత్తు–వాతావరణ గతిశీలత’ అంశంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో తలసరి కర్బన ఉద్గారాల స్థాయి సగానికంటే తక్కువగా ఉందన్నారు.
జీ-20 దేశాల్లో పారిస్ ఒప్పందం కింద ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక దేశం భారత్ అని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలపై బాధ్యతను మోపడం కంటే, అన్ని దేశాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
