
భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు దశాబ్దాల్లో భారీగా విస్తరించే అవకాశం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రస్తుతం సుమారు 4.015 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత GDP వచ్చే 20 ఏళ్లలో 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత్ ప్రస్తుతం కీలకమైన పరివర్తన దశలో ఉందని దోవల్ అన్నారు. 2047 వరకు ఉన్న కాలాన్ని ‘అమృత్ కాల్’గా అభివర్ణిస్తూ ఈ సమయంలో దేశంలో అనేక రంగాల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. భవిష్యత్తులో యువతకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
జీవితంలో కీలక నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవాలని దోవల్ పిలుపునిచ్చారు. ఇందుకు శ్రీరాముడి ఉదాహరణను ప్రస్తావించారు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉన్నందుకే విశ్వామిత్రుడు శ్రీరాముడిని ఎంచుకున్నారని గుర్తుచేశారు. కాలానుగుణంగా ఆలోచిస్తూ కొత్త అవకాశాలను స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
తన కెరీర్ తొలినాళ్లలో సిక్కింలో పనిచేసిన అనుభవాలను కూడా దోవల్ పంచుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే గూఢచారిగా తన కెరీర్ ప్రారంభించానని తెలిపారు. సిక్కింలో ఇంటెలిజెన్స్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన సమయంలో సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచడం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కదలికలు, కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించడం తన బాధ్యతగా ఉండేదని వివరించారు.
ఆ సమయంలో సిక్కిం భారత్‌లో విలీనం కాలేదని విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని దోవల్ పేర్కొన్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఓ షెర్పా నుంచి నేర్చుకున్న మూడు ముఖ్యమైన విషయాలను కూడా విద్యార్థులతో పంచుకున్నారు.
