
సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో రోబో టీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగిస్తూ చేపట్టిన ఈ ప్రయోగం తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇండస్ ల్యాబ్ సంస్థ పాఠశాలకు అందించిన రోబో టీచర్ తొలిసారిగా తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల ప్రగతి, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు రోబో స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో వారు ఆసక్తిగా గమనించారు.
సాధారణంగా ఉపాధ్యాయులతో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశాలకు భిన్నంగా రోబోతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. విద్యార్థులకు పాఠ్యాంశాలను మరింత ఆసక్తికరంగా సులభంగా అర్థమయ్యేలా చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతపై వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రోబో టీచర్‌ను పాఠశాలలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా సాంకేతికత ఆధారిత బోధనా విధానాలపై అవగాహన కలిగింది. రోబో నేరుగా మాట్లాడటం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ విద్యాబోధనలో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
