ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్‌తో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బెల్జియం ప్రధాని హోదాలో బార్ట్ డి వెవర్ భారత్‌లో తొలిసారి అధికారిక పర్యటనకు రావడం విశేషం.
ఈ సందర్భంగా భారత్–బెల్జియం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ టెక్నాలజీ, పోర్ట్ లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను వేగవంతం చేయడంతో పాటు, వ్యూహాత్మక సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
ప్రపంచ వజ్రాల వాణిజ్యంలో ఆంట్వెర్ప్ కేంద్రంగా భారత్–బెల్జియం మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యం, అభివృద్ధి చెందుతున్న రక్షణ సాంకేతిక సహకారం, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాళ్లపై బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేయడంపైనా ఇరువురు నేతలు చర్చించారు.

