
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రంలోపు మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హైకమాండ్ ఆమెకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అయితే అధిష్ఠానం ఆదేశాలను సురేఖ తిరస్కరిస్తే మాత్రం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని నిర్ణయించడంతో పాటు, ఈ మేరకు గవర్నర్‌కు లేఖ పంపే అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పరకాల అసెంబ్లీ సీటు విషయంలో కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లపై పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సురేఖను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని వారు పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా హైకమాండ్‌కు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం పార్టీ పెద్దలతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
హైకమాండ్ విధించిన డెడ్‌లైన్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కొండా సురేఖ తదుపరి నిర్ణయంపైనే ఉంది. పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ ఆమె రాజీనామా చేస్తారా? లేక అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన రాజకీయ బలాన్ని చాటుకుంటారా? అన్నది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
