
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు కీలక శుభవార్త ప్రకటించారు. రానున్న ఏడాది దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు (AI)పై శిక్షణ అందించే భారీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం ఆలపించామని పేర్కొంటూ, దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోందని, ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని చెప్పారు. దేశ ప్రజలు పెద్ద కలలు కనాలని, దృఢ సంకల్పంతో వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
2047 నాటికి భారత్‌ను ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ముందుకు సాగుతోందని, 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ‘ఆత్మనిర్భర్ భారత్’ను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’, స్వదేశీ ఉత్పత్తులు, ‘వోకల్ ఫర్ లోకల్’కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ప్రధాని కొనియాడారు. దేశంలో త్వరలోనే సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. డిజిటల్ రంగంతో పాటు కీలక ఖనిజాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే పలు దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు.
అణు విద్యుత్ రంగంలోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. త్వరలో ఐదు కొత్త న్యూక్లియర్ ప్లాంట్లు రానున్నాయని, భవిష్యత్తులో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ‘సముద్ర మంథన్’ కార్యక్రమం ద్వారా కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 1.75 కోట్ల ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్, 50 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వివరించారు. హైడ్రోజన్ రైళ్లను కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని తెలిపారు.
భారత్‌ను భయపెట్టేందుకు కొందరు గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రధాని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ ప్రజలకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. భారత్ తన అంతర్గత సామర్థ్యంపై నమ్మకంతో నిరంతరం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు.
