
దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంపై కీలక ప్రకటనలు చేశారు.
ప్రసంగం అనంతరం ఎర్రకోట ప్రాంగణంలోకి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ ఉన్న చిన్నారులు, ఎన్‌సీసీ క్యాడెట్లను ఆప్యాయంగా పలకరించారు. వారితో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా ముచ్చటించారు. పిల్లలను అభినందిస్తూ వారిలో ఉత్సాహం నింపారు.
తన 13వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో యువతను దేశ అభివృద్ధికి ప్రధాన శక్తిగా ప్రధాని అభివర్ణించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే యువతలోని ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యువత కోసం కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, కొత్తగా ఏర్పడుతున్న ఆర్థిక అవకాశాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమన్నారు.
భారత్‌లోనే ఉంటూ విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందే అవకాశాలను కల్పించే విధానాలను తీసుకురానున్నట్లు మోదీ తెలిపారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తున్నామని పేర్కొన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు ‘శక్తి సప్తధార’ సూత్రాన్ని కూడా ప్రధాని వివరించారు. తయారీ, వ్యవసాయం-ఆహార శుద్ధి, టెక్నాలజీ-ఇన్నోవేషన్, గతి శక్తి, రక్షణ, గ్రీన్-బ్లూ ఎకానమీ, యువశక్తి-సాఫ్ట్ పవర్ అనే ఏడు కీలక రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడు శక్తుల సమన్వయంతో భారత్ మరింత బలమైన ఆర్థిక, సాంకేతిక శక్తిగా ఎదిగి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
