
ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 24 వేల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 24 వేల కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు అందించినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 9.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డును కేవలం సరుకుల కోసం కాకుండా పేద కుటుంబాలకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ప్రభుత్వం అందిస్తోందన్నారు.
పేదలు కూడా సంపన్నులతో సమానంగా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడుతోందన్నారు.
