
యూరియా కోసం యాప్‌లో నమోదు చేసుకున్నప్పటికీ సకాలంలో ఎరువులు అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా యూరియా పంపిణీ కాకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది.
రైతుల వివరాల ప్రకారం తిమ్మాపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం యాప్‌లో ముందుగానే నమోదు చేసుకున్నారు. ఆదివారం వారికి ఎరువులు పంపిణీ చేసేందుకు ప్యాక్స్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది.
దీంతో సహనం కోల్పోయిన రైతులు ప్యాక్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన ఓ వ్యక్తి బల్లపై ఉన్న క్యాలిక్యులేటర్‌ను విసిరేయడంతో అది ధ్వంసమైంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్యాక్స్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
అయితే రైతులు శాంతించకపోవడంతో వారిని అడ్డుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి వ్యవసాయ పనులు వదులుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాంకేతిక సమస్య కారణంగా తమను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. యూరియా అందక పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి, తమకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
