
సింగరేణి సంస్థలో అలియాస్ పేర్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారసుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
సింగరేణిలోని 12 ఏరియాల్లో సుమారు 400 మంది అలియాస్ పేర్ల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ పేరుతో 2020 నుంచి పలువురు కార్మికుల వారసులకు ఉద్యోగాలు లభించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ప్రస్తుతం ఎనిమిది మంది బాధితులు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆదివారం వారి ఆరోగ్యం క్షీణించింది. బీపీ తగ్గడంతో తీవ్ర నీరసానికి గురయ్యారు. దీంతో దీక్షలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యపై ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
