
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో మల్లూరు క్షేత్రాన్ని మంత్రి సందర్శించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి అవసరాలను పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల డిజైన్‌ను ఖరారు చేయనున్నారు.
భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై అధికారులతో మంత్రి చర్చించారు. కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆలయ పవిత్రత చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సీతక్క ఆదేశించారు. ప్రస్తుత ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనుల ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
నిర్మాణ పనులు ప్రారంభించే ముందు రాక్ టెస్ట్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రాక్ టెస్ట్ నివేదిక ఆధారంగా తదుపరి సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
