
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పాలనలో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరగగా తాజాగా డీజిల్ టోకెన్ల వ్యవహారం సానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై కౌన్సిలర్ల ఆరోపణలు ఓ కౌన్సిలర్‌కు సంబంధించినట్లు చెబుతున్న ఆడియో వైరల్ కావడం వివాదానికి దారితీసింది.
మున్సిపాలిటీలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఇల్లందుల రమేష్‌కు ఓ కౌన్సిలర్ ఫోన్ చేసి డీజిల్ టోకెన్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తన వద్ద టోకెన్లు లేవని డీజిల్ టోకెన్ల వ్యవహారాన్ని మున్సిపల్ కమిషనర్ పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని రమేష్ సమాధానం ఇచ్చినట్లు చెబుతున్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ సంభాషణలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను అవహేళన చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆరోపించారు.
ఆడియోలోని మాటలు దాని పూర్తి సందర్భం సంభాషణ నిజానిజాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు కౌన్సిలర్ ఆడియో వ్యవహారాన్ని నిరసిస్తూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులను అవమానించేలా మాట్లాడటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధుల్లో జోక్యం చేసుకోకుండా ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలకు సంబంధించి రూ.32 లక్షల రికవరీ నోటీసుల వ్యవహారం పూర్తిగా సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి రావడం చర్చకు దారితీసింది. తాజా వివాదంపై సానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోపణలపై పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

