
భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలు సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ప్రకటనను శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు అధికారికంగా ఆమోదించే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విభేదాలను అధిగమించి సంయుక్త ప్రకటనకు అంగీకారం కుదరడం భారత్‌కు కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు.
సంయుక్త ప్రకటనలో ఏ ఒక్క దేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏ దేశమైనా ఏకపక్షంగా యుద్ధానికి దిగడాన్ని ఖండించే అంశాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రస్తుత గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్, యూఏఈ వైఖరులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇరాన్, యూఏఈ రెండూ బ్రిక్స్ సభ్య దేశాలే కావడంతో.. ఇరు దేశాలూ అంగీకరించే విధంగా ప్రకటన భాషను రూపొందించడం బ్రిక్స్ దౌత్యవేత్తలకు సవాలుగా మారింది.
బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్‌కు ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యమైనది. ఇరాన్‌తో పాటు యూఏఈతోనూ భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విభేదాలను పక్కనపెట్టి బ్రిక్స్ వేదికపై ఏకాభిప్రాయం సాధించేలా భారత్ చర్చలను ముందుకు నడిపింది. చివరకు సంయుక్త ప్రకటనపై అంగీకారం కుదరడం సదస్సుకు ముందే భారత్ సాధించిన కీలక దౌత్య విజయంగా నిలిచింది.
