స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు. దేశ ప్రగతి, యువత పాత్ర, స్వదేశీ సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి, మహిళల సాధికారతతో పాటు భవిష్యత్ భారత నిర్మాణంపై ప్రధాని మోదీ తన ఆలోచనలు, లక్ష్యాలను వివరించారు.
దేశ బలానికి సంబంధించిన ‘సప్తధార’ (ఏడు ప్రధాన ధారలు) విజన్‌ను ఆవిష్కరించారు. ఇందులో తయారీ రంగం, ఆహార ప్రాసెసింగ్, సాంకేతికత–ఆవిష్కరణలు, లాజిస్టిక్స్, రక్షణ రంగం, హరిత–నీలి ఆర్థిక వ్యవస్థ, సాఫ్ట్ పవర్ వంటి ఏడు కీలక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ మార్పులో దేశ యువతే అతిపెద్ద భాగస్వాములు, అతిపెద్ద లబ్ధిదారులు అవుతారని ప్రధాని మోదీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఒక కోటి మంది యువ భారతీయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాల్లో శిక్షణ అందించడంతో పాటు, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

