
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేసి 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఉప్పల్–నారపల్లి మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు వరంగల్ వైపు వెళ్లే వాహనాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టు పనులు ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ కాంట్రాక్టు సంస్థకు సంబంధించిన సమస్యలు న్యాయపరమైన అంశాల కారణంగా నిర్మాణం ఆలస్యమైందని మంత్రి వెల్లడించారు.
ప్రాజెక్టు కాంట్రాక్టర్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)ను ఆశ్రయించడంతో పనులకు కొంతకాలం అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సెకండరీ ఏజెన్సీని రంగంలోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ఈ కారణాలతో గతంలో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయలేకపోయామని పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ ఫ్లైఓవర్‌ను 2026 దసరా నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎదురైన అవరోధాల కారణంగా గడువు పొడిగించాల్సి వచ్చింది. ప్రస్తుతం సమస్యలను పరిష్కరించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యంతో ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
జాతీయ రహదారి–163పై ఉప్పల్–నారపల్లి మధ్య ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.425 కోట్ల అంచనా వ్యయంతో 2018లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వివిధ కారణాలతో గడువు పలుమార్లు పొడిగించాల్సి వచ్చింది.
ప్రాజెక్టు పూర్తయితే ఉప్పల్, నారపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి తూర్పు దిశగా ప్రయాణించే వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా వరంగల్, భువనగిరి, జనగామ ప్రాంతాలతో పాటు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు హైదరాబాద్ నగరాన్ని అనుసంధానించడంలో ఈ మార్గం కీలకంగా మారనుంది.
పనుల పురోగతిపై జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయ అధికారులు, చీఫ్ ఇంజనీర్‌తో ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెండింగ్ అంశాలను పరిష్కరించి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా కొన్ని బీటీ రోడ్ల పునరుద్ధరణ మరమ్మతు పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన నిర్మాణ పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసి 2027 జూన్ నాటికి ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
