
హైదరాబాద్ మహానగరానికి వికేంద్రీకృత పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే 20 నుంచి 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా సమర్థవంతంగా, సమన్వయంతో సేవలు అందించేలా పరిపాలనను తీర్చిదిద్దాలని చెప్పారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగర పాలనను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చడమే క్యూర్ యాక్ట్-2026 ఉద్దేశమని స్పష్టం చేశారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ అనేక రాజవంశాలు, సంస్కృతులను కలుపుకొని ప్రపంచస్థాయి నగరంగా ఎదిగిందని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు మూసీ తీరం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు నగరం సాధించిన అభివృద్ధి గొప్ప పరిణామానికి నిదర్శనమన్నారు. ఒకప్పుడు కొన్ని లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం కోటికిపైగా జనాభాతో విస్తరించిన మహానగరంగా మారిందని తెలిపారు.
ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. నగర గత వైభవాన్ని కాపాడుకుంటూనే భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించి ప్రజల ముందుంచామని శ్రీధర్ బాబు తెలిపారు. 2034 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ లక్ష్యాల సాధనలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని, నగరాన్ని మరింత ఆధునాతనంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. పరిపాలన వేగంగా, పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ కేవలం ఇతర దేశ రాష్ట్ర మహానగరాలతో పోటీపడే నగరం మాత్రమే కాదని తెలంగాణ ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన ప్రాంతమని శ్రీధర్ బాబు అన్నారు. క్యూర్ ప్రాంతం రాష్ట్ర విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో దాని పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. 2025-26లో తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ సుమారు రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని మంత్రి వివరించారు.
