
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీనివల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐ రంగాన్ని పర్యవేక్షించేందుకు ‘ఏఐ ఫోర్స్’ను ఏర్పాటు చేయడంతో పాటు త్వరలోనే ప్రత్యేక ‘ఏఐ జార్’ను నియమించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఏఐ సాంకేతికత, డేటా సెంటర్లపై విమర్శలు చేస్తున్న వారిని ఆయన తప్పుబట్టారు. ఏఐ రంగం అభివృద్ధిని అడ్డుకునే చర్యలకు తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు.
ఈ అద్భుతమైన పరిశ్రమ ఎదుగుదలను మేం ఏమాత్రం అడ్డుకోము లేదా నిరోధించము. ఇది విస్తరిస్తున్న కొద్దీ గౌరవిస్తాం ప్రోత్సహిస్తాం జాగ్రత్తగా పర్యవేక్షిస్తాం అని ట్రంప్ పేర్కొన్నారు. ఏఐ వల్ల ముప్పు పొంచి ఉందన్న ప్రచారాన్ని డెమోక్రాట్లు చేస్తున్న తప్పుడు ప్రచారంగా ఆయన అభివర్ణించారు. అంతకుముందు కూడా ఏఐపై స్పందించిన ట్రంప్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా సుపీరియర్ ఇంటెలిజెన్స్ లేదా ‘ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్’ వంటి పేర్లు సరిపోతాయని అన్నారు.
ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలంటున్న నిపుణులు
ట్రంప్ వ్యాఖ్యలకు కొద్ది రోజుల ముందే ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ దారియో అమోడీ ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని కొంత తగ్గించాలని సూచించారు. ఈ రంగంపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ మోడళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందే వాటి భద్రతకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఈ అభిప్రాయాలకు ఎలోన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు.
