
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో విమానం పార్కింగ్ బేకు వెళ్తుండగా VDGS (Visual Docking Guidance System) స్తంభాన్ని ఢీకొట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 4) ఉదయం సుమారు 9 గంటల సమయంలో బే నంబర్ 6 వద్ద ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ల్యాండింగ్ అనంతరం విమానం తనకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం ఢీకొనడంతో VDGS స్తంభం పక్కకు ఒరిగిపోయింది. విమానం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, విమానానికి జరిగిన నష్టం ఎంత మేరకు ఉందో ఏయే భాగాలు దెబ్బతిన్నాయనే దానిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని సాధారణ మెట్ల సహాయంతో విమానం నుంచి సురక్షితంగా దించారు. విమానం VDGS స్తంభాన్ని ఢీకొట్టడానికి గల కారణం ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదు. ఘటనకు దారితీసిన పరిస్థితులు కారణాలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రేక్ వైఫల్యం లేదా ఇతర సాంకేతిక సమస్యలపై వస్తున్న వార్తలను అధికారులు ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఈ ఘటన ప్రభావం శ్రీనగర్ విమానాశ్రయంలోని ఇతర విమానాల రాకపోకలపై పడలేదని అధికారులు తెలిపారు. విమాన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గురైన ఇండిగో విమానం తదుపరి సర్వీస్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
విమానాన్ని భద్రతా సాంకేతిక నిపుణులు పూర్తిగా పరిశీలించిన అనంతరం దాని తదుపరి ఆపరేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా విమానం పార్కింగ్ బేకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
