
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన కానుక అందించాలని భావించినట్లు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ తెలిపారు. అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో రూపొందించిన ‘ఇండియా గేట్’ ప్రతిరూపాన్ని మోదీకి బహుమతిగా ఇవ్వాలనుకున్నట్లు వెల్లడించారు. అయితే భారత్‌కు ప్రయాణించే సమయంలో ఆ చాక్లెట్ ప్రతిరూపం దెబ్బతిని చివరకు దేశానికి చేరకముందే కరిగిపోయిందని సరదాగా చెప్పారు.
న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో బార్ట్ డి వెవర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘‘నిజమైన ఇండియా గేట్ శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉంది కానీ చాక్లెట్‌తో తయారు చేసిన ఇండియా గేట్ మాత్రం భారత్‌కు చేరుకునేలోపే కరిగిపోయింది. దౌత్య సంబంధాలకు చాక్లెట్లు బాగుంటాయి కానీ దౌత్య ప్రయాణాలకు మాత్రం అంతగా పనికిరావు’’ అని ఆయన చమత్కరించారు.
బెల్జియం ప్రధాని వ్యాఖ్యలతో సమావేశంలో ఉన్న ప్రధాని మోదీతో పాటు ఇతరులు నవ్వుకున్నారు. అయితే మరో ‘ఇండియా గేట్’ చాక్లెట్ ప్రతిరూపం బెల్జియంలో సురక్షితంగా ఉందని బార్ట్ డి వెవర్ తెలిపారు. దానిని త్వరలోనే ప్రధాని మోదీకి అందజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా ఇరుదేశాల ప్రధానులు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఫిన్‌టెక్, క్లీన్ ఎనర్జీతో పాటు భారత్-బెల్జియం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగాయి. చాక్లెట్ ‘ఇండియా గేట్’ కరిగిపోయిన ఘటన ఈ ద్వైపాక్షిక సమావేశంలో సరదా వాతావరణాన్ని తీసుకురాగా ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు కొనసాగాయి.
