ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో ఉపాధ్యాయులతో ప్రధాని సరదాగా ముచ్చటిస్తూ వారి అనుభవాలు, వినూత్న బోధనా పద్ధతులను ఆసక్తిగా తెలుసుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడిన మోదీ.. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలో అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలను ప్రధానితో పంచుకున్నారు. పిల్లలకు ఇంటర్వ్యూలు చేయడం నేర్పిస్తున్నానని ఓ ఉపాధ్యాయురాలు చెప్పగా “అలాగైతే మీ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను కూడా ‘ఎందుకు వంట చేశారు?’ అని ప్రశ్నిస్తున్నారా?” అంటూ మోదీ సరదాగా ప్రశ్నించారు. దీంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.

విద్యార్థులకు పబ్లిక్ స్పీకింగ్‌లో శిక్షణ ఇస్తున్న మరో ఉపాధ్యాయుడిని ఉద్దేశించి మోదీ ఆసక్తికర ప్రశ్న వేశారు. “నేను మీ విద్యార్థినని అనుకుంటే మంచి వక్తగా ఎదగడానికి నాకు ఎలాంటి చిట్కాలు ఇస్తారు?” అని అడిగారు. దీంతో కాస్త తడబడిన ఆ ఉపాధ్యాయుడు నిరంతర సాధనతో పాటు మోదీ వ్యక్తిత్వ ప్రభావాన్ని చూసి నేర్చుకోవచ్చని చెప్పడంతో వాతావరణం మరింత ఉల్లాసంగా మారింది.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా విద్యకు దూరంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థులు నేడు ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదవాలనే కలలను సాకారం చేసుకుంటున్న తీరును ఓ ఉపాధ్యాయుడు వివరించారు.

మరో మహిళా ఉపాధ్యాయురాలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు తాము చేస్తున్న పరిశోధనలు కార్యక్రమాల గురించి ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన మోదీ తన నియోజకవర్గమైన కాశీలో భారీ స్థాయిలో నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అది గిన్నిస్ రికార్డు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో స్క్రీన్ టైమ్ ఒకటని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకువచ్చి మైదానాల్లో ఆడే ఆటలు సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు. అదే సమయంలో యువతను ప్రభావితం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై కూడా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల్లో కనిపించే మార్పులను నిశితంగా గమనించాలని కోరారు.

విద్యార్థులను కేవలం సిలబస్ పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారి జీవితాల్లోకి ప్రవేశించి వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికితీయాలని మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిల్లల్లోని ‘బాల్యాన్ని’ కాపాడటం ఉపాధ్యాయుల కీలక బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ వారిని స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలని సూచించారు.

By Rajini