
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో మరోసారి ఆందోళనకు దిగింది. తమ కార్యకర్త తండ్రి సంజయ్‌కుమార్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేయాలంటూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించింది.
ఈ నిరసనలో సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్‌దాస్, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆందోళన నేపథ్యంలో స్వతంత్ర భరద్వాజ్‌ను 72 గంటల్లో అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం విస్తృతంగా గాలింపు చేపట్టి కొన్ని గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
21 ఏళ్ల స్వతంత్ర భరద్వాజ్ తనను తాను కరడుగట్టిన హిందువుగా చెప్పుకొంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూలై 20న జంతర్‌మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై మాట్లాడాడు. ఆ నిరసనలో సీజేపీ కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌కుమార్‌పై తానే దాడి చేసినట్లు చెప్పుకొచ్చాడు.
సంజయ్‌కుమార్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచానని ఆయనకు 60 కుట్లు పడ్డాయని భరద్వాజ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నిషు ఆజాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రకటించినప్పటికీ తనను మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదని అతడు పేర్కొన్నాడు.
అంతేకాకుండా ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ప్రధాని నరేంద్ర మోదీ తనకు అండగా ఉన్నారని వారంతా తనకు ‘పెద్దన్నలు’ అంటూ భరద్వాజ్ వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
జంతర్‌మంతర్ వద్దకు వచ్చి నిరసనకారులపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు ఎందుకు ముందుగానే గుర్తించి అరెస్టు చేయలేకపోయారని సౌరవ్‌దాస్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. స్వతంత్ర భరద్వాజ్ అరెస్టుతో సీజేపీ చేపట్టిన ఆందోళనకు తాత్కాలికంగా తెరపడినప్పటికీ ఈ ఘటనపై రాజకీయ విమర్శలు మాత్రం కొనసాగుతున్నాయి.
