
దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్ 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో సేవలను అందిస్తోంది. అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉండగా భారత్ దానికి కేవలం 216 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ఇదే వేగం కొనసాగితే రాబోయే రెండేళ్లలో అమెరికాను అధిగమించి, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలోని కేవలం ఐదు నగరాల్లోనే 245 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు అందుబాటులో ఉండేవి. గత 12 ఏళ్లలో ఈ నెట్‌వర్క్ దాదాపు ఐదు రెట్లు విస్తరించి, ప్రస్తుతం 26 నగరాలకు చేరింది.
ఇక దేశవ్యాప్తంగా మరో 1,000 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తుండటంతో రాబోయే రోజుల్లో మెట్రో నెట్‌వర్క్ మరింత వేగంగా విస్తరించనుందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గాలతో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా అమెరికా రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త నగరాల్లోనూ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు.
