గోవా పోలీసులకు ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి పతాకం లభించింది. అత్యుత్తమ ప్రజాసేవ, ధైర్యం, అంకితభావానికి గుర్తింపుగా యూనిఫామ్డ్ సర్వీసులకు అందించే అత్యున్నత గౌరవంగా భావించే ఈ పతాకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా పోలీసులకు ప్రదానం చేశారు.
తలైగావ్లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా ఈ గౌరవాన్ని అందజేశారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్, గోవా పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఘనమైన అలంకరణ పరేడ్ ను కేంద్ర హోంమంత్రి పరిశీలించారు. అనంతరం గోవా పోలీసులకు ‘నిశాన్’ ను అందజేశారు. కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా 1946లో ప్రారంభమైన గోవా పోలీసు వ్యవస్థ నేడు ఆధునిక ప్రజా కేంద్రిత పోలీసు దళంగా రూపాంతరం చెందిందని ప్రశంసించారు.
తీర ప్రాంత భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, పర్యాటకుల భద్రత వంటి కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న గోవా పోలీసుల సేవలను ఆయన కొనియాడారు.
