
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందన్నారు. సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు. బుధవారం ఉదయానికి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాత ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు.
అలాగే, ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. మరో ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉందన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆదివారం (సెప్టెంబర్ 20) ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృతమైన వాతావరణంతో పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
