
దేశ రాజధాని ఢిల్లీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ‘రిజర్వేషన్ హఠావో’ పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది పాల్గొన్నారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేయగా, మరికొందరు ఆర్థిక అసమానతలను ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
సుమారు 5.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ నిరసనకు మద్దతుగా ప్రచారం నిర్వహించింది. ఆగస్టు 21న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఆ పేజీ ముందుగానే పిలుపునిచ్చింది. ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలుత ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల వరకు రామ్‌లీలా మైదానంలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
అయితే, నిరసనకు ఒకరోజు ముందు వేదికను మార్చడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము జంతర్ మంతర్ నుంచి వెనక్కి వెళ్లబోమని, తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామని కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న అభిషేక్ అగ్నిహోత్రి తెలిపారు. బిహార్‌కు చెందిన నిరసనకారుడు ప్రత్యూష్ గౌర్ రిజర్వేషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
రిజర్వేషన్లను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. దీనివల్ల అధిక మార్కులు సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. నిరసనలు చేపట్టిన తర్వాతే ప్రజల డిమాండ్లను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. పాలకులు ప్రజా సమస్యల కంటే మతాలు, కులాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు.
