
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, విస్తరణ, భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు.
సమావేశానికి ముందు బీజేపీ నేతలంతా వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను ఆలపించారు. అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రజా జీవితంలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చ జరగనుంది.
2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన ప్రయాణాన్ని ప్రజలకు వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ హాజరయ్యారు.
మరోవైపు, నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. కొత్త టీమ్‌లో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించారు.


