
త్రివిధ దళాల ఆధునికీకరణకు సంబంధించి రూ.1.10 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ పరికరాల సేకరణ మండలి (డీఏసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం సేకరణలో 98 శాతానికి పైగా పరికరాలను దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఆర్మీ కోసం కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్‌ఎన్) పరికరాలు, రీకనయిజెన్స్ వెహికల్స్, హై మొబిలిటీ వెహికల్స్, సెల్ఫ్ ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్స్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, ట్వాల్ ట్యాంకులు, సర్వత్రా బ్రిడ్జి సిస్టమ్‌లను సమకూర్చుకోనున్నారు.
నౌకాదళం కోసం ఆరుద్ర రాడార్లు, వాటి అప్‌గ్రేడెడ్ వేరియంట్లు మెరైన్ గ్యాస్ టర్బైన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎయిర్ రూట్ సర్వైలెన్స్ రాడార్ల స్థానంలో ఆరుద్ర రాడార్లను ప్రవేశపెట్టనున్నారు. యుద్ధనౌకల నడక కోసం అవసరమైన మెరైన్ గ్యాస్ టర్బైన్ల రూపకల్పన అభివృద్ధిలోనూ దేశీయ సామర్థ్యాలను పెంపొందించనున్నారు. దీంతో ఈ రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని మరింత తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వాయుసేన కోసం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లను సేకరించనున్నారు. అదనంగా గ్రౌండ్ బేస్డ్ మల్టీపర్పస్ జామర్లు, సెక్యూర్ అసెస్ కార్డ్ సిస్టమ్‌ల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. దేశీయంగా రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడం ఈ సేకరణల ప్రధాన లక్ష్యాలుగా రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
వాయుసేనను మరింత బలోపేతం చేస్తూ కీలక నిర్ణయాన్ని రక్షణ శాఖ తీసుకుంది. గగనతలం నుంచి గగనతలం వరకు దూసుకెళ్లే ఆర్‌వీవీ బీడీ క్షిపణుల్లో అమరేలా సుఖోయ్- 30 ఎమ్‌కేఎల్ ఫైటర్లను నవీకరించాలని నిర్ణయించింది. దానివల్ల 300 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాన్ని అత్యంత వేగంతో పూర్తి కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం లభిస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
బ్రిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లదమీర్ పుతిన్ భారత్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుఖోయ్‌లకు సంబంధించిన ప్రతిపాదనను రక్షణ శాఖ పరిశీలిస్తుండటం గమనార్హం. పుతిన్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇందులో సుఖోయ్- 30 నవీకరణ అంశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
