
హైదరాబాద్‌లో మరో కీలక స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సైదాబాద్‌లోని నల్లగొండ ఎక్స్ రోడ్డులో రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు లేన్ల వంతెనను గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు మొత్తం 3.32 కిలోమీటర్ల మేర ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ కారిడార్ అందుబాటులోకి రావడంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా, కీలక మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
