
హైదరాబాద్‌ను పర్యాటక నగరంగానే కాకుండా ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని సీఎం వెల్లడించారు.
భారత్ ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం తదితర అంశాలపై ఇరువర్గాలు చర్చించాయి.
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి వారికి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ ప్రతినిధులను సీఎం కోరారు.
సమావేశంలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కూడా సీఎం వివరించారు. తొలిదశలో మూసా ఈసా నదుల సంగమ ప్రాంతం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధితో పాటు రాత్రి వేళల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచేలా ‘నైట్ ఎకానమీ’కి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.


