
డీ న్యూస్, ఆగస్టు 12: ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. అదానీపై కేసు కొట్టివేయడం వెనుక పైకి కనిపిస్తున్న దానికంటే మరిన్ని విషయాలు ఉన్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ లొంగిపోయి, భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ఈ మేరకు బుధవారం ఉదయం రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. “దీని వెనుక పైకి కనిపిస్తున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది. ప్రధాని లొంగిపోయారు. భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఇందుకు భారతదేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలు సౌరవిద్యుత్ ఒప్పందాలు దక్కించుకునేందుకు భారత్‌లోని అధికారులకు దాదాపు రూ.2,300 కోట్ల లంచాలు చెల్లించారనే ఆరోపణలపై 2024లో అమెరికాలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులోని అభియోగాలను యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ‘విత్ ప్రిజుడిస్’తో కొట్టివేశారు. దీంతో ఇదే ఆరోపణలపై భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వం అదానీపై మళ్లీ కేసు నమోదు చేసే అవకాశం లేకుండా కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
