
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించడంతో పాటు హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మహేశ్వర్ రెడ్డి బుధవారం సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకున్న మహేశ్వర్ రెడ్డి తనతో చర్చకు రావాలని మంత్రిని మరోసారి డిమాండ్ చేశారు.
తాను మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటానని, మంత్రి శ్రీనివాస రెడ్డి అప్పటిలోగా రావాలని డెడ్‌లైన్ విధించారు. భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్, రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థలకు భూముల బదలాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
మంత్రి పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా? లేక మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా తన వద్ద ఉన్న ఆధారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
