
తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకునేందుకు ఉద్దేశించిన సెక్షన్ 22Aను ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు ఉపయోగించకూడదని హరీశ్ రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి యజమానులను వేధిస్తున్నారని ఆరోపించారు.
రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 22A నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు దళారులు మార్కెట్ విలువలో 30 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చినట్లు నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారని గుర్తు చేసిన హరీశ్ రావు.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.ఓఆర్ఆర్ పరిసరాల్లోని భూములపై వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం రెవెన్యూ శాఖలో ఇంతటి అవకతవకలు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు.
