
హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన లింకులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాకిస్థాన్ ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌కు సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.
గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.
ఈ కేసులో గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్‌కు కీలక లింకులు ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్‌లో జాయిద్ ఖాన్ పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో పరిచయం ఏర్పడిన అనంతరం, ఆ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న వ్యక్తులతో జాయిద్ చాటింగ్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
ఐఎస్ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న హమీద్, రాణా హుస్సేన్‌లతో జాయిద్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారి మధ్య జరిగిన చాటింగ్‌పై అధికారులు నిఘా పెట్టి, నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
