
స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఆనందోత్సాహాల పర్వదినమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భగవత్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పూర్వీకులు చేసిన అపార త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
1857లో ప్రారంభమైన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రస్తావించిన భగవత్ దాదాపు తొమ్మిది దశాబ్దాల పాటు భారతీయులు నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది తమ జీవితాలను దేశానికి అంకితం చేసి, ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. వారి త్యాగం, అంకితభావం, దేశభక్తిని తరతరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ మార్పు కోసం జరిగిన ఉద్యమం కాదని, దేశ భవిష్యత్తును నిర్మించేందుకు సాగిన మహత్తర పోరాటమని భగవత్ పేర్కొన్నారు. స్వేచ్ఛ కోసం పూర్వీకులు చేసిన త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది, ప్రస్తుత తరం దేశ నిర్మాణంలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్యం సాధించినంత మాత్రాన బాధ్యత ముగియదని దాన్ని పరిరక్షించడంతో పాటు దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, స్వావలంబన, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
స్వాతంత్ర్య ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన అవసరం ఉందని భగవత్ అన్నారు. దేశంలో అత్యుత్తమమైన, ఉదాత్తమైన, ఉన్నతమైన, ఆనందదాయకమైన అంశాలు వికసించే వాతావరణాన్ని నిర్మించడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు.
పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నిజమైన దేశభక్తి అని భగవత్ అన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తిని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రతిరోజూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
