
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. శనివారం పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోటలో నిర్వహించే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
ఈ ఏడాది వేడుకలకు మరో ప్రత్యేకత ఉంది. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సుమారు వెయ్యి సీసీటీవీ కెమెరాలతో పాటు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానితులు, నేరగాళ్ల కదలికలపై భద్రతా సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
ఎర్రకోటలో జరిగే వేడుకలకు వీఐపీలు సహా సుమారు 25 వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోటకు వచ్చే అన్ని మార్గాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నేరస్థులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ‘అభిజ్ఞాన్’ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ డేటాబేస్‌లో ఇప్పటికే 1.32 కోట్ల మంది వివరాలను నిక్షిప్తం చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్ల ద్వారా వివరాలను డేటాబేస్‌తో అనుసంధానించి అనుమానితులను గుర్తిస్తున్నారు.
జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలోనూ ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
