
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండగా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టును వేగవంతం చేయడంలో విఫలమవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. తాజాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు టెండర్ల గడువును ఆరోసారి పొడిగించడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 20 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది.
భారత్మాల పరియోజన ఫేజ్-1లో భాగంగా జాతీయ రహదారి 161ఏఏ కింద సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 161 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ద్వారా ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి ఎన్హెచ్ఏఐ 2025 నవంబర్ 11న తొలిసారిగా టెండర్లు ఆహ్వానించింది. అయితే కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు రావడంలో జాప్యం కారణంగా టెండర్ల ప్రక్రియ పదేపదే వాయిదా పడుతున్నది.
బీఆర్ఎస్ హయాంలోనే సూత్రప్రాయ అనుమతి
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2021 ఫిబ్రవరిలో సూత్రప్రాయ అనుమతి లభించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
ఉత్తర భాగం ప్రాజెక్టు కోసం మొత్తం 1,918 హెక్టార్ల భూమి అవసరమవుతుండగా.. ఇందులో సుమారు 60 శాతం భూసేకరణ పూర్తయినట్టు ఆర్అండ్బీ అధికారులు చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల పురోగతిలో జాప్యం చోటుచేసుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దక్షిణ భాగం అలైన్మెంట్పై వివాదం
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు వివాదాస్పదంగా మారింది. కొందరు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న వారి భూములను కాపాడేందుకే అలైన్మెంట్ను మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అభ్యంతరాలను పట్టించుకోకుండా చౌటుప్పల్, ఆమన్గల్, సంగారెడ్డి మీదుగా 201 కిలోమీటర్ల మేర సవరించిన దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతులు ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూపులు.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనూ ప్రాజెక్టు పురోగతి మందగించడంతో కీలకమైన ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం ఎప్పటికి పట్టాలెక్కుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి
