
DNews:23 Jan: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మరియు పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ కేసులో జాయింట్ సీపీ విజయ్ కుమార్ మరియు ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని అధికారుల బృందం కేటీఆర్‌ను విచారిస్తోంది. గతంలో హరీశ్ రావును విచారించినప్పుడు సేకరించిన స్టేట్‌మెంట్‌తో పాటు ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రత్యేక ప్రశ్నలను సిద్ధం చేసి కేటీఆర్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్లు సమాచారం.
విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే తమపై కేసులు మోపుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రజల కోసమే పనిచేశామని, తాము ఎలాంటి అనైతిక పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి విచారణలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. విచారణకు తాము భయపడబోమని, ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
