
DNews:23 Jan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు (జనవరి 23, 2026) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లేముందు ఆయన హరీశ్ రావుతో కలిసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడూతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘దొంగ ముఖ్యమంత్రి’గా అభివర్ణించిన కేటీఆర్, ఆయన 2015లో ‘ఓటుకు నోటు’ కేసులో రూ. 50 లక్షలతో దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన సింగరేణి బొగ్గు గనుల కుంభకోణాన్ని హరీశ్ రావు బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యగా ఈ సిట్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఒక ‘డైలీ సీరియల్’లా మార్చారని, రాజకీయ లీకుల ద్వారా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. డ్రగ్స్ మరియు హీరోయిన్లతో ముడిపెట్టి చేస్తున్న ఆరోపణల వల్ల తన పరువుకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో నిజంగా నిజాయితీ ఉంటే మాజీ డీజీపీలు, ప్రస్తుత ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు.విచారణలకు తాము భయపడమని, ఎన్నిసార్లు పిలిచినా వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడిన పార్టీ తమదని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న ‘దండుపాళ్యం ముఠా’ (మంత్రులు) ఆగడాలను ఎండగడుతూనే ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
