
DNews:11 NOV:జగిత్యాల, జర్నలిస్టుల రైల్వే పాసులను తిరిగి పునరుద్ధరించాలంటూ టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ప్రతినిధులు జగిత్యాల ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశానికి వచ్చిన ఎంపీని కలిసిన టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణచారి ఈ పత్రాన్ని అందజేశారు.
జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పాత్రలో కీలకంగా ఉంటారని వారు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసులను రాయితీతో అందిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇచ్చే రాయితీ రైల్వే పాసులను నిలిపివేసిందని పేర్కొన్నారు. పాసులను పునరుద్ధరించడంలో ఎంపీ తన వంతు పాత్ర పోషించాలని కోరారు.
ఈ సందర్భంలో ఎంపీ అరవింద్ సానుకూలంగా స్పందించారు. రైల్వే పాసుల పునరుద్ధరణ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీని కలిసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్టులు రాజేందర్ రెడ్డి, ఆనంద్, వంశీకృష్ణ, చింత లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
