
DNews:12 NOV:జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం రేపింది. బీదర్–హైదరాబాద్ హైవేపై దుండగులు ఓ లారీని అడ్డగించి, అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన పాన్ మసాలా గుట్కా లోడును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం — కర్ణాటకలోని బీదర్ నుంచి సోమవారం రాత్రి రూ.20 లక్షల విలువైన గుట్కా లోడ్‌తో లారీ హైదరాబాద్ వైపు బయలుదేరింది. ఈ సమాచారం ముందుగానే తెలిసిన దుండగులు లారీని వెంబడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గంగా చౌరస్తా వద్ద లారీని ఆపి, తాము పోలీసులు అని చెప్పి నిమ్జ్ వెంచర్ వైపు తీసుకెళ్లారు.
తర్వాత డ్రైవర్ మరియు అతనితో ఉన్న ఇద్దరిని కిందకు దించి, వారి మొబైల్ ఫోన్లను లాగేసుకుని, కారులో నిర్బంధించి కర్ణాటక సరిహద్దుల వరకు తీసుకెళ్లారు. అక్కడ లారీలోని రూ.20 లక్షల విలువైన లోడును తమ వాహనంలో ఎక్కించుకొని, అలాగే డ్రైవర్ దగ్గర ఉన్న రూ.42 వేల నగదును కూడా లాక్కొని పరారయ్యారు.
తరువాత దుండగుల నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్ మరియు మరొకరు హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.
