
DNews:12 Dec: ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు ఆయన భార్య దువ్వాడ మాధురి మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారారు. ఈసారి వారిపై అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌లో ఉన్న ది పెండెంట్ ఫామ్ హౌస్‌లో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో అక్కడ అనుమతి లేని మద్యం పార్టీ జరుగుతోందని గుర్తించడంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలీసుల దాడుల సమయంలో, ఫామ్ హౌస్‌లో ఎంఎల్‌సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే—ఆ రోజు మాధురి పుట్టినరోజు కూడా కావడం, అందువల్ల పార్థసారథి పేరుపై ఫామ్ హౌస్‌ను బుక్ చేసినట్లు పోలీసులకు తెలిసింది.ఈ వేడుకకు మొత్తం 29 మంది హాజరైనట్లు సమాచారం.
వేడుక సందర్భంగా అనుమతి తీసుకోకుండా మద్యం పార్టీ నిర్వహించడం, శబ్ద కాలుష్యం, మరియు అనుమానాస్పద కార్యాకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం రావడంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు.పోలీసుల స్వాధీనం చేసుకున్నవి 10 స్కాచ్ మద్యం బాటిళ్లు, 5 హుక్కా సెట్లు, ఇంకా పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనతో ఫామ్ హౌస్ నిర్వహణకర్తతో పాటు ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.దువ్వాడ శ్రీనివాస్ దంపతుల పేరు గతంలో కూడా వివిధ ఆరోపణల నేపథ్యంలో వినిపించడంతో, తాజా ఘటన వారిని మరొకసారి చర్చలోకి తెచ్చింది. పదవిలో ఉన్న వారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల ప్రజలు, రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందిస్తున్నారు.
