
DNews:17 NOV:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారులకు నిధులు విడుదల విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇంటి నిర్మాణానికి దశలవారీగా అందించే మొత్తంలో కోత విధించడంపై లబ్దిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఇంటి నిర్మాణదారులకు దశలవారీగా చెల్లించే మొత్తంలో కోత పెట్టింది. ముఖ్యంగా, స్లాబ్ (Roof) వేసినఅనంతరం చెల్లించాల్సిన రూ.2 లక్షల మొత్తంలో నుంచి రూ.60 వేలు కోత విధిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ దశలో లబ్దిదారుల ఖాతాలో కేవలం రూ.1.40 లక్షలు మాత్రమే జమచేస్తామని తెలిపారు. మిగిలిన రూ.60 వేల మొత్తాన్ని ఉపాధి హామీ పథకం మరియు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (స్వచ్ఛ భారత్ మిషన్) కింద సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొనడం లబ్దిదారులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
ఇల్లు కట్టుకునేందుకు అప్పోసప్పో చేసి స్లాబ్ వరకు పనులు పూర్తి చేసుకున్న లబ్దిదారులు, ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఆ అప్పులు తీర్చుకోవాలనే ధీమాతో ఉన్నారు. కానీ, ఈ నిధుల కోత ప్రకటనతో వారు అవాక్కవుతున్నారు. నిర్మాణానికి పూర్తిస్థాయిలో రూ.5 లక్షలు ఇస్తామని మొదట ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు ఇలా వ్యవహరించడంపై లబ్దిదారుల్లో తమ ఖాతాలో పూర్తి మొత్తం జమ అవుతుందా లేదా అనే అయోమయం నెలకొంది.ఇంటి నిర్మాణానికి, ఉపాధి హామీ పథకానికి లింకు పెట్టడంపై అనేకమంది లబ్దిదారులు మండిపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇల్లు నిర్మిస్తున్న వారిలో సగానికిపైగా మందికి జాబ్ కార్డులు లేవు. జాబ్ కార్డులు ఉన్నవారికి కూడా రూ.60 వేలు జమ అయ్యే పరిస్థితులు లేవని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఉపాధి హామీ కింద రోజుకు రూ.307 చొప్పున 90 రోజులకు రూ.27,690 మాత్రమే జమ అయ్యే అవకాశం ఉంది.మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.12,000 మాత్రమే విడుదల అవుతాయి.ఈ రెండు కలిపినా సుమారు రూ.39,630 మాత్రమే లబ్దిదారుల ఖాతాలోకి చేరే అవకాశం ఉండగా, మిగిలిన రూ.20,970 ఎలా చెల్లిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
లబ్దిదారుల ఆవేదన, డిమాండ్లు:
అష్టకష్టాలు పడి ఇల్లు దక్కించుకున్న లబ్దిదారులు, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల తాము మరింత అప్పుల్లోకి కూరుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. చిగురుమామిడి మండలంతో సహా అనేక ప్రాంతాల లబ్దిదారులు, ముందుగా ప్రకటించిన విధంగా స్లాబు వేసిన తర్వాత పూర్తి రూ.2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రూ.60 వేలు తమ ఖాతాలో జమయితే ప్లాస్టరింగ్ వంటి మిగిలిన పనులు పూర్తి చేసుకునేందుకు వీలవుతుందని కోరుతున్నారు.
అధికారుల వివరణ:
ఈ వివాదం నేపథ్యంలో, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ స్పందిస్తూ, లబ్దిదారులకు ప్రకటించిన రూ.5 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం తప్పక చెల్లిస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాగానే మిగిలిన మొత్తాన్ని ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాల కింద వారి ఖాతాల్లో జమచేస్తామని వివరణ ఇచ్చారు.అయితే, రూ.5 లక్షలు పూర్తిగా అందుతాయనే హామీ ఉన్నప్పటికీ, నిధుల చెల్లింపు విధానంపై పూర్తి స్పష్టత లేకపోవడం మరియు నిర్మాణాన్ని ఇతర పథకాలతో లింకు చేయడం వంటి అంశాలు లబ్దిదారులలో గందరగోళాన్ని సృష్టించి, ఇంటి నిర్మాణ పనులకు ఆటంకంగా మారుతున్నాయి.
