
DNews:17 NOV:నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని రోడ్ల సమస్యలను వివరించడానికి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి వారు ప్రత్యేకంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వెళ్లారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని కేంద్ర మంత్రికి తెలిపారు. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ సమస్య కారణంగా మారుమూల గ్రామాలకు రోడ్ల అభివృద్ధికి సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుని, నిధులు మంజూరు చేయాలని వారు గడ్కరీని కోరారు. కాగా, తమ వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
