
D News: Jul 28: RK Roja: మెగా డీఎస్సీ భర్తీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీయూ) రెండో గేట్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, డీఎస్సీ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలతో పాటు డీఎస్సీ భర్తీ ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని రోజా కోరారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
“మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ”
ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఇది మెగా డీఎస్సీ కాదు.. నిరుద్యోగులను మోసం చేసిన దగా డీఎస్సీ. డీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పాటు నోటిఫికేషన్, నియామక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయి” అని ఆరోపించారు.
అలాగే, “420 జీవో తీసుకొచ్చి 427 పోస్టులను అనర్హులకు కేటాయించారు” అని ఆరోపించిన రోజా, రాష్ట్రంలో రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు లేకపోవడం, నియామకాలలో అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల 191 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని రోజా ఆరోపించారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అనంతరం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉపాధి కోసం లక్షలాది మంది యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని కూడా పేర్కొన్నారు.
లోకేష్ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగిస్తాం
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై కూడా రోజా విమర్శలు చేశారు. గతంలో మహిళల జీవితాలతో, ఇప్పుడు నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసే వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
