
DNews:22 Nov:కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో గ్రామానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులను, అపరిచితులుగా భావించిన గ్రామస్తులు దాడి చేయడానికి యత్నించిన ఘటన కలకలం రేపింది.
మద్దిగుంటకు చెందిన రమేశ్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ భీమవరానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నేపథ్యంలో ఆమె నుంచి రమేశ్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అయితే స్వదేశానికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసపూరితంగా వ్యవహరించడంతో, బాధిత మహిళ భీమవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది.
ఈ కేసులో రమేశ్‌ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మఫ్టీలో మద్దిగుంటకు చేరుకున్నారు. అయితే గ్రామంలో మధ్యరాత్రి అపరిచితులు తిరుగుతున్నట్లు గమనించిన గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసి, వారిపై దాడికి యత్నించారు. పరిస్థితి విషమించడంతో ఏపీ పోలీసులు స్థానిక రామారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులను శాంతింపజేసి, అపోహలను నివారించారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
