
DNews: Nov 22: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచారు. గత రెండు రోజులుగా రవిని విచారిస్తున్నారు. రెండవ రోజు ఆరుమూడు గంటలపాటు కస్టడీలో ప్రశ్నలు అడిగారు. ఈ విచారణలో కీలకమైన అంశాలు బయటపడ్డాయని సమాచారం. శనివారం మూడవ రోజు కూడా విచారణ కొనసాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సినిమాలను సరఫరా చేస్తున్నవారు, రవికి సహకరిస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఏజెంట్లు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారు.
విచారణలో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలు కొనుగోలు చేసినట్లు బయటపడింది. ‘మూవీ రూల్జ్’ అనే వెబ్సైట్ నుంచి పెద్ద మొత్తంలో సినిమాలు కొనుగోలు చేసి, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసినట్లు రవి పోలీసులకు తెలిపాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్‌లకు గేట్వేగా మార్చినట్లు కూడా తేలింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బుతోనే సినిమాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అభిమానులను పెంచుకునేందుకు కరేబియన్ దీవుల్లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి, నాణ్యమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లు కూడా బయటపడింది. ఈ పనిలో భాగంగా రవి 20 మంది యువకులను నియమించుకున్నాడని సమాచారం.
