
DNews:22 Nov:హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉండే మార్గం. ఈ హైవేపై ఉన్న ఆరాంఘర్ జంక్షన్ నగరంలోని అత్యంత బిజీ ప్రాంతాలలో ఒకటి. అయితే ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొన్ని దుకాణాలు, వ్యాపారాలు యధేచ్ఛగా నిర్మించుకోవడంతో ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మేరకు స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
ఫిర్యాదులపై స్పందించిన అధికారులు శనివారం (నవంబర్ 22) ఉదయం ఆరాంఘర్ చౌరస్తా, పిల్లర్ నెంబర్ 294 పరిసర ప్రాంతాల్లో భారీ బందోబस्तు నడుమ కూల్చివేతలు చేపట్టారు. రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ చర్యలు అమలు చేశారు.
కూల్చివేతల సమయంలో కొందరు వీధి వ్యాపారులు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రాంతంలో ఫుట్‌పాత్‌లను శుభ్రపరచడం, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
